Hardik Patel: మూడేళ్లు వృథా చేసుకున్నా.. ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయించుకోలేదు!

కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత ఏ రాజకీయ పార్టీలో చేరాలనే అంశంపై ఇంకా తాను ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని గుజరాత్‌లోని ....

Published : 20 May 2022 01:31 IST

హర్దిక్‌ పటేల్‌ వ్యాఖ్యలు

అహ్మదాబాద్‌: కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత ఏ రాజకీయ పార్టీలో చేరాలనే అంశంపై ఇంకా తాను ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని గుజరాత్‌లోని పాటీదార్‌ నేత హార్దిక్‌ పటేల్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి నిన్న రాజీనామా చేయడంతో హార్దిక్‌ భాజపాలో చేరతారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలపై అహ్మదాబాద్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇప్పటివరకైతే భాజపా లేదా ఆప్‌.. ఏ పార్టీలో కూడా తాను చేరే అంశంపై నిర్ణయం తీసుకోలేదని స్పష్టంచేశారు. తనలాగే కాంగ్రెస్‌ పార్టీలో అనేకమంది అసంతృప్తితో ఉన్నారంటూ హార్దిక్‌ బాంబుపేల్చారు.

కాంగ్రెస్‌లో మూడేళ్లు వృథా చేసుకున్నా..

అలాగే, కాంగ్రెస్‌ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఏఏ వంటి హిందువులకు సంబంధించిన సమస్యలపై గానీ వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదులో శివలింగం లభ్యం కావడం వంటి అంశాలపై కాంగ్రెస్‌ ఎప్పుడూ మాట్లాడలేదని విమర్శలు గుప్పించారు. గుజరాత్‌లో కాంగ్రెస్‌ కుల రాజకీయాలు చేస్తోందని, ఆ పార్టీలో తన మూడేళ్ల కాలాన్ని వృథా చేసుకున్నానన్నారు. కాంగ్రెస్‌కు విజన్‌ లేదని, గుజరాత్‌ ప్రజల పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. 33 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీని ఏడెనిమిది మంది నడుపుతున్నారని, తనలాంటి కార్యకర్తలు రోజూ 500-600 కి.మీల రోజూ ప్రయాణిస్తున్నారన్నారు. ఒకవేళ తాను ప్రజల మధ్యకు వెళ్లి వారి పరిస్థితుల్ని తెలుసుకొనేందుకు ప్రయత్నిస్తే.. ఇక్కడ పెద్ద నేతలు మాత్రం ఏసీ గదుల్లో కూర్చొని తమ ప్రయత్నాన్ని భగ్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించారు. 

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాటీదార్‌ (పటేల్‌ వర్గం) నేత హార్దిక్‌ పటేల్‌ నిన్న కాంగ్రెస్‌ పార్టీ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ‘‘పార్టీలో అగ్రనేతలకు రాష్ట్రంలో, దేశంలో సమస్యల కంటే మొబైల్‌ ఫోన్లపైనే ఎక్కువ ధ్యాస. వారికి చికెన్‌ శాండ్‌విచ్‌లు సమకూర్చడంపైనే గుజరాత్‌ కాంగ్రెస్‌ నేతలకు ఆసక్తి’’ అంటూ తన రాజీనామా లేఖలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది చివరిలో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో యువ నేత హార్దిక్‌ రాజీనామా ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని