Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 20 May 2022 09:20 IST

1.  Nikhat Zareen: రింగ్‌లో సివంగి

13 ఏళ్ల వయసులో ఆ అమ్మాయి బాక్సింగ్‌లో తలపడుతున్న అబ్బాయిలను చూసింది. కానీ అక్కడ తనకు బాక్సింగ్‌ చేస్తున్న ఆడపిల్లలు కనిపించలేదు. అమ్మాయిలు ఎందుకు బాక్సింగ్‌ చేయడం లేదంటూ తండ్రిని అడిగింది. వాళ్లకు బలం తక్కువగా ఉంటుంది కదా అని ఆయన నవ్వుతూ బదులిచ్చాడు. బాక్సింగ్‌లో మహిళల బలాన్ని చాటాలని అప్పుడే ఆ అమ్మాయి నిర్ణయించుకుంది. చేతులకు గ్లౌజులు తొడిగి రింగ్‌లో అడుగుపెట్టింది. కానీ సాధన చేద్దామంటే.. మరే అమ్మాయి కూడా లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘గడప గడప’లో వాగ్వాదాలు

రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాల్లో ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ నిరసనలు, నిలదీతలు, వాగ్వాదాల మధ్య కొనసాగుతోంది. మంత్రులు, ఎమ్మెల్యేలను గురువారం ప్రజలు వివిధ సమస్యలపై ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో అమలైన విదేశీ విద్య పథకాన్ని మీరు అధికారంలోకి వచ్చాక ఎందుకు ఆపేశారంటూ విజయవాడ పాతబస్తీలోని కుమ్మరివీధిలో మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావును ఓ యువకుడు, ఆమె తల్లి నిలదీశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ఆ చేపలు మావి.. తొలగించం

3. ఎవరెస్టుపై ఎత్తయిన వాతావారణ కేంద్రం

ప్రపంచంలో ఎత్తయిన ఆటోమేటిక్‌ వాతావరణ కేంద్రాన్ని నేషనల్‌ జియోగ్రాఫిక్‌ సొసైటీ నిపుణులు ఎవరెస్టు శిఖరంపై 8,830 మీటర్ల ఎత్తున ఏర్పాటు చేశారు. వివిధ వాతావరణ మార్పులను స్వయంచాలకంగా ఈ కేంద్రం గుర్తిస్తుంది. ఎవరెస్టు శిఖరాగ్రానికి (8,848.86 మీటర్లు) కొద్ది మీటర్ల దిగువన ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు నేపాల్‌కు చెందిన జల, వాతావరణ విభాగం (డీహెచ్‌ఎం) తెలిపింది. సౌరశక్తి సాయంతో ఇది పనిచేస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. విచారిస్తారా.. అప్పగిస్తారా..!

ఉక్రెయిన్‌ తరఫున పోరాడుతూ చివరకు రష్యాకు లొంగిపోయిన సైనికులు విచారణను ఎదుర్కోవాల్సి వస్తుందా, యుద్ధ ఖైదీల మార్పిడి కింద తిరిగి మాతృ దేశానికి వెళ్లగలుగుతారా అనేది తేలడం లేదు. అజోవ్‌ రెజిమెంట్‌కు చెందిన పోరాట దళాలను తిరిగి అప్పగించడాన్ని నిషేధించే తీర్మానంపై రష్యా పార్లమెంటు చర్చించి ఒక నిర్ణయం తీసుకోనుంది. మేరియుపొల్‌ నగరంలోని బంకర్లలో ఉంటూ తమతో పోరాడి చివరకు లొంగు‘బాట’లోకి వచ్చిన అజోవ్‌ రెజిమెంట్‌ సైనికులు 1,750 మంది వరకు ఉంటారని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రాజ్యసభ టికెట్‌కు రూ.200 కోట్లైనా ఇచ్చేవారున్నారు: బీద మస్తాన్‌రావు

రాజ్యసభ టికెట్‌ను రూ.100 కోట్లకు అమ్ముకున్నారంటూ తెదేపా బురదజల్లే రాజకీయం చేస్తోందని వైకాపా అభ్యర్థి బీద మస్తాన్‌రావు పేర్కొన్నారు. ‘రూ.100 కోట్లు తీసుకుని ఎంపీ టికెట్‌ ఇచ్చేలా ఉంటే రూ.200 కోట్లు ఇచ్చేందుకైనా ఓసీ అభ్యర్థులు సిద్ధంగా ఉంటారు’ అని వ్యాఖ్యానించారు. ‘వైకాపా అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు డబ్బుతో ఏమి అవసరం ఉంటుంది? రూ.10 కోట్లు, రూ.100 కోట్లతోనే కాలం గడిచిపోతుందా’ అని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

అరగంట ముందుగా డ్రైవర్‌ సెల్‌ఫోన్‌ నంబరు!

6. హైదరాబాద్‌లో ‘ఒమిక్రాన్‌ బీఏ.4’

దక్షిణాఫ్రికా.. తదితర దేశాల్లో కొవిడ్‌ కేసుల ఉద్ధృతికి కారణమైన ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ ‘బీఏ.4’... భారత్‌లోనూ వెలుగు చూసింది! ఈ వేరియంట్‌ తొలికేసు ఈనెల 9న హైదరాబాద్‌లో నమోదైంది. ఇండియన్‌ సార్స్‌ కొవ్‌-2 కన్షార్షియం ఆన్‌ జీనోమిక్స్‌ (ఇన్సాకాగ్‌) గురువారం ఈ విషయాన్ని వెల్లడించింది. దేశంలోని మరిన్ని నగరాల్లో ఈ సబ్‌ వేరియంట్‌ కేసులు నమోదయ్యే అవకాశముందని భారత వైద్య పరిశోధన మండలి శాస్త్రవేత్త ఒకరు అభిప్రాయపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. చూసిపోదామని చివరిసారి!

ఆదిలాబాద్‌ సిమెంట్‌ పరిశ్రమ (సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా- సీసీఐ)లో నిర్మాణాలను తుక్కు కింద వేలంలో విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో.. గతంలో అందులో పనిచేసిన ఉద్యోగులు ఒకింత నిర్వేదానికి గురయ్యారు. 1982 ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పరిశ్రమ 2,500 మందికి ప్రత్యక్షంగా.. మరో 2 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించింది. ఆర్థిక భారంతో 1999లో మూతపడింది. మళ్లీ తెరవకపోతారా? అని చాలా మంది ఉద్యోగులు వేచిచూస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

17ఏళ్ల గోడు.. పేదలకు లేదా గూడు

8. కార్డు లేకుండానే నగదు ఉపసంహరణ

కార్డు లేకుండానే ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణకు వీలు కల్పించాలని బ్యాంకులను ఆర్‌బీఐ కోరింది. ఏటీఎంలలో ఇంటర్‌ఆపరబుల్‌ కార్డ్‌ లెస్‌ క్యాష్‌ విత్‌డ్రాయల్‌ (ఐసీసీడబ్ల్యూ) అవకాశాన్ని కల్పించాలని తెలిపింది. స్కిమ్మింగ్‌, కార్డ్‌ క్లోనింగ్‌, డివైజ్‌ టాంపరింగ్‌ వంటి మోసాలు జరగకుండా ఈ చర్య ఉపయోగపడనుంది. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు మాత్రమే సొంత ఏటీఎంలలో కార్డులేకుండా నగదు ఉపసంహరణకు వీలు కల్పిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వచ్చే నెలలో గ్రూప్‌-4 ప్రకటన!

రాష్ట్రంలో 9,168 గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. వచ్చేనెలలో టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉద్యోగ ప్రకటన జారీకి వీలుగా ప్రయత్నాలు ప్రారంభించింది. గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి అనుమతిస్తూ త్వరలో ఉత్తర్వులు జారీ చేయాలని నిర్ణయించింది. గురువారమిక్కడ బీఆర్‌కే భవన్‌లో గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీ, ఉద్యోగ ప్రకటనలపై టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ బి.జనార్దన్‌రెడ్డితో కలిసి ప్రభుత్వ విభాగాధిపతులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కాల్మొక్త సారూ... కనికరించరూ..!

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం వెల్గనూర్‌ గ్రామానికి చెందిన కొక్కల సంతోష్‌ వ్యవసాయ మోటారుకు విద్యుత్తు కనెక్షన్‌ కోసం రెండు సంవత్సరాల క్రితం డీడీ తీసి అధికారులకు అందజేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు సిబ్బంది ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేసి విద్యుత్తు స్తంభాలు వేశారు. నెలలు గడిచినా కనెక్షన్‌ మాత్రం ఇవ్వడంలేదు. సమయానికి నీరందక తనకున్న రెండెకరాల్లోని పంటలు ఎండిపోతున్నాయని.. వెంటనే విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని రైతు రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరిగారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మనం సిన్మా తీస్తున్నాం.. రాత్రుళ్లు చర్చించుకుందాం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని