Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Published : 19 May 2022 09:01 IST

1. కాలుష్యం కోరలకు 90 లక్షల మంది బలి

కాలుష్యం కోరల్లో చిక్కి భారత్‌లో ఒక ఏడాది (2019)లోనే 23.5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయినట్లు తాజాగా ‘లాన్సెట్‌’ అధ్యయనం వెల్లడించింది. అన్ని రకాల కాలుష్యాల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా 90 లక్షల మరణాలు సంభవించినట్లు పేర్కొంది. జెనీవాలోని అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ, కాలుష్య నియంత్రణ సంస్థకు చెందిన రిచర్డ్‌ ఫుల్లర్‌ ఈ అధ్యయనానికి నాయకత్వం వహించారు. అధ్యయన బృందంలో చెన్నైకి చెందిన శ్రీరామచంద్ర యూనివర్సిటీలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకార కేంద్రం డైరెక్టర్‌ కె.బాలకృష్ణన్‌ కూడా ఉన్నారు.

2. తిరుమలలో భక్తుల రద్దీ.. 23 కంపార్టుమెంట్లలో భక్తులు

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కరోనా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఇటీవల భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం శ్రీవారి సర్వదర్శనానికి 23 కంపార్టుమెంట్లతో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 74,389 మంది భక్తులు దర్శించుకోగా.. 38,007 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

3. ప్రయాణంలో ఒడిదొడుకులు.. ఒక్కోసారి గోతులు ఎక్కువ ఉండొచ్చు: చినజీయర్‌

ఆంధ్రప్రదేశ్‌లో రహదారులపై చినజీయర్‌ స్వామి బుధవారం రాజమహేంద్రవరం పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భక్తులను ఉద్దేశించి ఆయన ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తూ.. ‘ప్రయాణం చేసేటప్పుడు ఒడిదొడుకులు ఉండవచ్చు. ఒక్కోసారి గోతులు ఎక్కువ ఉండవచ్చు. మేం జంగారెడ్డిగూడెం నుంచి రాజమహేంద్రవరం దాకా రావడానికి.. చాలా బాగుంది.. చక్కగా జ్ఞాపకం ఉండేట్టు ఉంది’ అని (వ్యంగ్యంగా) వ్యాఖ్యానించారు.

4. అనాసపండుతో అల్జీమర్స్‌కు అడ్డుకట్ట!

అనాసపండు (పైనాపిల్‌)లో ఉండే ‘బ్రొమెనైల్‌’ సమ్మేళనం అల్జీమర్స్‌ను సమర్థంగా నియంత్రించగలదని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు పంజాబ్‌లోని ఫగ్వారాలో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ నిపుణులు ఎలుకలపై విజయవంతంగా ప్రయోగాలు చేపట్టారు. పరిశోధనలో భాగంగా కొన్ని ఎలుకలకు నిపుణులు ఏఐసీఐ3, డీ-గెలాక్టోస్‌ సమ్మేళనం ఇవ్వడం ద్వారా వాటికి కృత్రిమంగా అల్జీమర్స్‌ తెప్పించారు. తర్వాత వాటిలో వచ్చిన మార్పులను గమనించారు.

5. 26న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 26న రాష్ట్ర పర్యటనకు రానున్నారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఐఎస్‌బీ వార్షికోత్సవంలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటన నేపథ్యంలో ప్రధానికి ఘనస్వాగతం పలకడంతో పాటు సీనియర్‌ నేతలతో భేటీకి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రయత్నిస్తున్నారు. అనుమతి కోసం ప్రధానమంత్రి కార్యాలయాని(పీఎంవో)కి సమాచారం పంపించారు. 

6. ఎస్సీ, ఎస్టీలకు విద్యుత్‌ షాక్‌

ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్‌ అందిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. వారు వినియోగించిన విద్యుత్‌కు డిస్కంలు ఇప్పటివరకు బిల్లులు వసూలు చేయట్లేదు. కానీ, ఇకపై  ఎస్సీ కాలనీలు, ఎస్టీ తండాల్లో కాకుండా బయట ఉండేవారికి ఉచిత విద్యుత్‌ వర్తించదంటూ ప్రభుత్వం షాక్‌ ఇవ్వబోతోంది. దీనికి అనుగుణంగా విద్యుత్‌ సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయా వర్గాల కనెక్షన్ల లెక్కలు తీస్తున్నాయి. 

7. చరిత్రకు పంచ్‌ దూరంలో..

ప్రపంచ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో 25 ఏళ్ల నిఖత్‌ జోరు కొనసాగుతోంది. ఎదురొచ్చిన ప్రత్యర్థులను కొట్టుకుంటూ.. బలంతో, తెలివితో బోల్తా కొట్టిస్తూ.. రింగ్‌లో సివంగిలా కదులుతూ.. ప్రపంచ ఛాంపియన్‌ టైటిల్‌ దిశగా ఆమె దూసుకెళ్తోంది. 52 కేజీల విభాగం ఫైనల్లో అడుగుపెట్టిన తను.. పసిడికి పంచ్‌ దూరంలో నిలిచింది. బుధవారం సెమీస్‌లో ఆమె 5-0 తేడాతో కరోలిన్‌ డి అల్మీదా (బ్రెజిల్‌)ను చిత్తుచిత్తుగా ఓడించింది.

8. ప్రతి వినియోగదారు నుంచి రూ.200!

ఈ ఏడాదిలో మరో దఫా పెంచే ఛార్జీలతో ప్రతి వినియోగదారు నుంచి ప్రతినెలా వసూలయ్యే సగటు మొత్తం (ఆర్పు) రూ.200కు చేరుతుందని భారతీ ఎయిర్‌టెల్‌ భారత్‌-దక్షిణాసియా ఎండీ, సీఈఓ గోపాల్‌విత్తల్‌ చెప్పారు. సంస్థ లక్ష్యమైన ఆర్పు రూ.300కు చేరడం అయిదేళ్లలో సాకారమవుతుందని ఇన్వెస్టర్‌ కాల్‌లో వివరించారు. 2021 మార్చి త్రైమాసికంలో రూ.145గా ఉన్న ఆర్పు, 2022 మార్చి చివరకు రూ.178కి చేరిందని గుర్తు చేశారు.

9. పాంగాంగ్‌ సరస్సుపై చైనా మరో అక్రమ వంతెన

ఎల్‌ఏసీ వెంబడి చైనా భారీ కుట్రకు తెరలేపింది. తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సుపై మరో అక్రమ వంతెన నిర్మాణం చేపట్టింది. ఇప్పటికే ఈ సరస్సు ఉత్తర, దక్షిణ భాగాలను కలుపుతూ గత ఏడాది చివర్లో వారధి నిర్మాణం ప్రారంభించి.. ఏప్రిల్‌లో పూర్తి చేసింది. ఇప్పుడు దీన్ని ఆనుకొనే మరింత భారీగా, వెడల్పుగా అత్యంత బరువున్న సైనిక వాహనాలను, భారీ స్థాయిలో దళాలను వేగంగా తరలించేందుకు కొత్త వంతెన నిర్మిస్తోంది. 

10. ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తులకు.. ఆ మూడింటి వల్లే తీవ్రస్థాయి కొవిడ్‌ ముప్పు

ఆరోగ్యవంతులతో పోలిస్తే, ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తులకు తీవ్రస్థాయి కొవిడ్‌ ముప్పు ఎందుకు ఎదురవుతోంది?- ఈ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం లభించింది! ఆస్ట్రేలియాకు చెందిన సెంటినరీ ఇన్‌స్టిట్యూట్‌, యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ సిడ్నీ శాస్త్రవేత్తల పరిశోధనలో ఇందుకు సంబంధించిన కీలక విషయాలు వెలుగు చూశాయి. వైరస్‌ సోకిన ఏడు రోజులకు ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తుల శ్వాసవ్యవస్థలోని కణాలు... ఆరోగ్యవంతుల్లోని కణాల కంటే 24 రెట్లు ఎక్కువగా ఇన్‌ఫెక్షన్‌కు గురవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని