KTR: లండన్‌ కింగ్స్ కాలేజ్‌తో ఒప్పందం.. భారత్, యూకే సంబంధాలు మరింత బలోపేతం: కేటీఆర్‌

ప్రతిష్టాత్మక లండన్ కింగ్స్ కాలేజ్‌తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే ఫార్మా యూనివర్సిటీకి సంబంధించిన

Published : 19 May 2022 20:49 IST

హైదరాబాద్: ప్రతిష్టాత్మక లండన్ కింగ్స్ కాలేజ్‌తో తెలంగాణ ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోయే ఫార్మా యూనివర్సిటీకి సంబంధించిన పరిశోధన, అకడమిక్ వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కింగ్స్‌ కాలేజ్ కలిసి పనిచేయనుంది. యూకే పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, కింగ్స్ హెల్త్ పార్ట్‌నర్స్ ఈడీ ప్రొఫెసర్ రిచర్డ్ ట్రెంబాత్‌లో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.

గత నెలలో బ్రిటీష్ కౌన్సిల్ నేతృత్వంలో లండన్‌ కింగ్స్ కాలేజ్ ప్రెసిడెంట్, ప్రిన్సిపాల్‌ సహా కాలేజ్‌ ప్రతినిధులు భారత్‌లో పర్యటించారు. దానికి కొనసాగింపుగా మంత్రి కేటీఆర్ లండన్‌లోని కింగ్స్ కాలేజ్ క్యాంపస్‌ను సందర్శించారు. తాజా ఒప్పందంతో ఫార్మా రంగంలో ఉన్నత విద్యా అవకాశాలు, పరిశోధన, విద్యార్థుల బదలాయింపుతో పాటు పాఠ్యాంశాల తయారీలో కింగ్స్ కాలేజ్ సహకారం అందించనుంది. ఫార్మా సిటీ, లైఫ్ సైన్సెస్ అంశాల్లో తెలంగాణ ప్రభుత్వానికి కింగ్స్ కాలేజ్ తోడ్పాటు ఇవ్వనుంది. టెక్నాలజీ, హెల్త్ కేర్ రంగాల్లో ఉన్నత విద్యా అవకాశాలను అందిపుచ్చుకునేందుకు తాజా ఒప్పందం దోహదపడుతుందని కింగ్స్ కాలేజ్ ప్రెసిడెంట్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శితిజ్ కపూర్ తెలిపారు.

కేటీఆర్‌ మాట్లాడుతూ.. కింగ్స్ కాలేజ్‌తో ఒప్పందం భారత్, యూకే సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. హైదరాబాద్ ఫార్మా సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌గా మారబోతుందని తెలిపారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటు ఆ ప్రణాళికలో భాగమేనని చెప్పారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఎకో సిస్టం విలువ 50 బిలియన్ డాలర్లకు చేరుతుందని.. ఫార్మా పరిశోధన, శిక్షణలో ప్రపంచంలోని అత్యంత్య నైపుణ్యం కలిగిన విశ్వవిద్యాలయంతో తెలంగాణ ప్రభుత్వం కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. కింగ్స్ కాలేజ్, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఒప్పందం యూకే, భారత్‌ సంబంధాల్లో మైలురాయి లాంటిదని యూకే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఛాంపియన్ సర్ స్టీవ్ స్మిత్ అన్నారు. ఈ ఒప్పందంతో ఫార్మా రంగంలో పరిశోధన, బోధనాంశాల్లో తెలంగాణకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం, సహకారం అందుతుందని అభిప్రాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని